ఆప్టోమెట్రీ విభాగంలోను కొలువుల వెలుగులు! 1 m ago
మన కంటికి ఏదైనా సమస్య వస్తే కంటి వైద్యుల వద్దకు వెళ్లినపుడు అక్కడ డాక్టర్ కంటే ముందు కళ్లను పరికరాల సహాయంతో నిశితంగా పరిశీలించే నిపుణులే ఆప్టోమెట్రిస్టులు. తక్కువ టైమ్‌లో స్ధిరపడాలనుకునేవారు ఎంచుకునే ముఖ్యమైన కోర్సు ఆప్టోమెట్రీ కోర్సు ఒకటి. ఇంటర్ విద్యార్హతతో డిప్లొమా, బ్యాచిలర్స్ ఎందులోనైనా చేరవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ తర్వాత మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీ కోర్సూ పూర్తి చేసుకోవచ్చు. రాష్ట్రస్ధాయి సంస్ధల్లో బీఎస్సీ ఆప్టోమెట్రీలో చేరాలంటే బైపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్ తప్పనిసరి. రాష్ట్ర స్థాయి సంస్ధల్లో ఇంటర్ మార్కుల మెరిట్‌తో అవకాశం లభిస్తుంది. జాతీయ సంస్ధలు ప్రవేశ పరీక్ష లేదా నీట్ స్కోర్‌తో తీసుకుంటున్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ మూడేళ్ల కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్ధులు, నాలుగో ఏడాది ఇంటర్న్‌షిప్ కోసం హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ ఐ హోస్పిటల్ , విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్ క్యాంపస్‌ల్లో పూర్తిచేయవచ్చు.